కరీంనగర్: తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహనీయుల చరిత్రను భావి తరాలకు అందించాలని విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ, అంబేద్కర్ కాలేజ్ కరస్పాండెంట్ గడ్డం సరోజా వివేక్ అన్నారు. కరీంనగర్ లోని జ్యోతి నగర్ వివేకానంద విగ్రహం వద్ద నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవాలకు సరోజా వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... నిజాం పాలన నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్లే ఇవాళ తెలంగాణ దేశంలో అంతర్భాగమైందన్నారు.
దేశంలో విలీనం అయ్యేది లేదంటూ ఆనాడు నిజాం రాజు పట్టుబట్టారని, అయితే అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారని కొనియాడారు. విమోచన దినోత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని సరోజా వివేక్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులు డా. భాగ్యరెడ్డి, రాంజీ, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు.